Madhu Yaskhi: కేసీఆర్ అక్రమాలపై పోరాటం చేయండి.. రాజకీయంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుంది: మధు యాష్కీ
![Must fight against KCR corruption says Madhu Yashki](https://imgd.ap7am.com/thumbnail/cr-20210821tn6120d2b4ac02c.jpg)
- ధరలు, నిరుద్యోగ సమస్యలపై మాత్రమే పోరాటాలు చేస్తున్నారు
- ప్రజలను కులాలవారీగా చీల్చేందుకు కేసీఆర్ కుట్ర
- రాజకీయ లబ్ధి కోసమే దళితబంధు
తెలంగాణలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై మాత్రమే పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ అన్నారు. తెలంగాణలో భారీగా జరుగుతున్న అవినీతి, ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమాలపై కూడా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అక్రమాలపై పోరాటం చేస్తే... అది రాజకీయంగా ఎదగడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలను కులాలవారీగా చీల్చేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని మండిపడ్డారు.
కేవలం రాజకీయ లబ్ధి కోసమే దళితబంధు పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని మధు యాష్కి దుయ్యబట్టారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితబంధు మాదిరే బీసీ బంధు, మైనార్టీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ, పువ్వు పార్టీ రెండూ పల్టీ కొడతాయని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.