Taliban: ఆఫ్ఘన్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి కీలక పత్రాలు, కార్లు ఎత్తుకెళ్లిన తాలిబన్లు
- రాయబార కార్యాలయాల్లో తాలిబన్ల తనిఖీలు
- కాందహార్, హీరత్ నగరాల్లో ఘటనలు
- ఇప్పటికే ఆఫ్ఘన్ నుంచి భారత సిబ్బంది వెనక్కి
ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న తాలిబన్లు ఆ దేశంలోని పలు కార్యాలయాలు, ఇళ్లలో తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా భారత రాయబార కార్యాలయాల్లో సోదాలు చేసి పలు పత్రాలు మాత్రమే కాకుండా అక్కడ పార్క్ చేసి ఉన్న కార్లను సైతం ఎత్తుకెళ్లారు. కాందహార్, హీరత్ నగరాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఆ ప్రాంతాల్లోని రెండు రాయబార కార్యాలయాల్లో అన్ని వస్తువులనూ తాలిబన్లు పరిశీలించారు. మరోవైపు, పౌరుల ఇళ్లలోనూ తాలిబన్లు తనిఖీలు చేపడుతున్నారు. కాగా, కాబూల్ లో భారత్ ఎంబసీ ఉండగా.. దేశంలోని నాలుగు ఇతర నగరాల్లో కాన్సులేట్స్ వున్నాయి. కొన్ని వారాల క్రితమే భారత్ మజార్ యే షరీఫ్ లోని రాయబార కార్యాలయాన్ని మూసి వేసింది. ఇప్పటికే ఆఫ్ఘన్ నుంచి భారత్ తమ సిబ్బందిని వెనక్కి తీసుకొచ్చింది.