Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో విమానం నుంచి ఇద్దరు జారిపడింది వీళ్ల ఇంటిపైనే!

The two slipped from a plane in Afghanistan on their home

  • ఇంటిపై నుంచి భారీ శబ్దం
  • వెళ్లి చూడగా కళ్లు తిరిగి పడిపోయిన భార్య
  • దుస్తులతో మృతదేహాలను కప్పి మసీదుకు తరలించిన ఇంటి యజమాని
  • రోడ్డులు నిర్మానుష్యంగా మారాయని వ్యాఖ్య
  • భయంభయంగా జీవిస్తున్నామన్న ఆఫ్ఘన్ పౌరుడు

కొన్ని రోజుల క్రితం తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పారిపోవడంతో అధ్యక్ష భవనం కూడా తాలిబన్ల హస్తగతమైంది. ఈ విషయం తెలిసిన ఆఫ్ఘన్ పౌరులు కాబూల్ ఎయిర్‌పోర్టుకు పరుగులు తీశారు. అక్కడి నుంచి ఏ దేశమైనా పారిపోవాలని ప్రయత్నించారు.

ఈ క్రమంలో కొంతమంది శరణార్థులను విదేశాలకు తరలిస్తున్న అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానం ఎక్కడానికి ప్రజలు ఎగబడ్డారు. అప్పుడే విమానం చక్రాలను గట్టిగా పట్టుకొని ప్రయాణం చేయడానికి చూశారు ఇద్దరు ఆఫ్ఘన్ పౌరులు. అయితే విమానం గాల్లోకి లేవగానే వారి పట్టుజారింది. దీంతో విమానాశ్రయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఒక ఇంటిపై పెద్ద శబ్దం చేస్తూ పడ్డారు.

ఆ ఇంటి యజమాని పేరు వాలి సాలెక్. ఇంటిపై నుంచి శబ్దం రావడంతో వేగంగా వెళ్లి చూడగా.. అక్కడ దృశ్యం అతనికి భయోత్పాతం కలిగించిందని చెప్పారు. తన భార్య ఆ దృశ్యం చూసి స్పృహ తప్పినట్లు వాలి తెలిపారు. ఆ తర్వాత టీవీలో వైరల్ అయిన వీడియోలోని వ్యక్తులు వారేనని తెలిసిందని వెల్లడించారు.

ఇద్దరు వ్యక్తుల తలలు పగిలిపోయాయని, పొట్టకూడా పగిలి ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉందని ఆయన వివరించారు. మృతుల్లో ఒకరి జేబులో దొరికిన బర్త్ సర్టిఫికెట్ ప్రకారం అతను సఫియుల్లా హోతక్ అనే డాక్టరని తెలిసిందట. రెండో వ్యక్తి పేరు ఫిదా మహమ్మద్ అని సమాచారం. ఇద్దరి వయసూ 30 మించి లేదు. ఈ మృతదేహాలను దుస్తులతో కప్పి, స్థానికంగా ఉన్న మసీదుకు తరలించినట్లు వాలి చెప్పారు. తాలిబన్ల ఆక్రమణతో కాబూల్‌ వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయని, ఏ క్షణం ఏం జరుగుతుందో అనే భయంతో ప్రజలు బిక్కచచ్చిపోతున్నారని ఆయన అన్నారు. కుదిరితే తాను కూడా వేరే దేశం పారిపోవాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News