Revanth Reddy: ఇక మిగిలింది ఒకే ఒక్క అడుగు.. అది కేసీఆర్ నెత్తిన పెడతాం: రేవంత్‌రెడ్డి
- రావిర్యాల దళిత గిరిజన, ఆత్మగౌరవ దండోరా సభకు పోటెత్తిన జనం
- కేసీఆర్ పాలనలో ప్రజలు దోపిడీకి గురయ్యారు
- కేసీఆర్ సభకు పల్లీలు అమ్ముకునేంతమంది కూడా రాలేదు
- కృష్ణానది ఉప్పొంగి రావిల్యాల వచ్చినట్టుంది
- కేసీఆర్ వేధింపులు భరించలేకే ప్రవీణ్ కుమార్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్ శివారు రావిర్యాలలో నిర్వహించిన దళిత గిరిజన, ఆత్మగౌరవ దండోరా సభకు జనం పోటెత్తారు. ఈ సభలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ నెత్తిమీద అడుగుపెట్టి పాతాళానికి నెట్టే సమయం దగ్గరపడిందని అన్నారు.
ఇంద్రవెల్లిలో తొలి అడుగు పడిందని, మలి అడుగును మహేశ్వరంలో వేశామన్న ఆయన మిగిలిన మూడో అడుగు కేసీఆర్ నెత్తిమీదేనన్నారు. సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కృష్ణానది ఉప్పొంగి వరదగా మారి రావిల్యాలకు వస్తే ఎలా ఉంటుందో, గండిపేట, హిమాయత్‌సాగర్, హుస్సేన్ సాగర్ కలిసి వరదై ప్రవహిస్తే ఎలా ఉంటుందో ఈ సభ కూడా అలానే ఉందన్నారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా జనం వచ్చారని, మొన్న హుజూరాబాద్‌లో కేసీఆర్ పెట్టిన సభకు పల్లీలు అమ్ముకునేంత మంది కూడా రాలేదని అన్నారు.
కేసీఆర్ పాలనతో నిరుద్యోగ యువత, అమరుల కుటుంబాలు, రైతులు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు దోపిడీకి గురయ్యాయని రేవంత్ అన్నారు. సాధించుకున్న రాష్ట్రంలో దోచుకుంటున్న వారెవరో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఉప ఎన్నికలు వచ్చిన హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ప్రకటించారని, దళితులందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
దళితులు, గిరిజనులు అడుగుతున్నది సంక్షేమ పథకాలు కాదని.. విద్య, ఉపాధి అవకాశాలు అడుగుతున్నారని అన్నారు. కేసీఆర్ వచ్చాక 4,634 పాఠశాలలను మూసివేశారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌కు సీఎం పదవి, కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు, కుమార్తెకు ఎంపీ, ఎమ్మెల్సీ పదవి, బంధువుకి రాజ్యసభ పదవి వచ్చిందని, కానీ అమరుల కుటుంబాలకు ఏమీ రాలేదని అన్నారు. డీజీపీ అయ్యే అవకాశం ఉన్న ప్రవీణ్ కుమార్.. కేసీఆర్ అవమానాలు భరించలేకే రాజీనామా చేశారని రేవంత్ పేర్కొన్నారు.