Gandhi Hospital: హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం ఘటన.. ఇంకా లభించని మరో బాధితురాలి ఆచూకీ
- నిందితులను విచారిస్తున్న పోలీసులు
- విచారణను వేగవంతం చేయాలంటూ హోంమంత్రి ఆదేశాలు
- ఆసుపత్రిని సందర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన కేసులో మరో బాధితురాలి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. దీంతో ఆమె కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. మరోవైపు, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమామహేశ్వర్, సెక్యూరిటీ గార్డులను పోలీసులు ప్రశ్నించారు. ఈ ఘటనపై నిన్న సమీక్షించిన హోంమంత్రి మహమూద్ అలీ విచారణను మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కొత్వాల్ అంజనీకుమార్‌ను ఆదేశించారు.
మహిళా కమిషన్ సభ్యురాలు షబానా అఫ్రోజ్‌తో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డి నిన్న గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలిని గుర్తించిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విచారణ వేగంగా జరుగుతోందని, వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని అన్నారు. నిందితులను ఉపేక్షించబోమని, వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
మరోమంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడా నిన్న ఆసుపత్రిని సందర్శించారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కాగా, ఆసుపత్రికి వచ్చిన మంత్రితో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య వాగ్వివాదానికి దిగారు. నిజనిర్ధారణకు ఆసుపత్రికి వస్తే తమను అడ్డుకుని వ్యాన్‌లో ఎక్కించారంటూ మండిపడ్డారు. దీంతో స్పందించిన మంత్రి ఇకపై నిజనిర్ధారణకు వచ్చిన వారిని అడ్డుకోవద్దంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావుకు సూచించారు.
కాగా, అత్యాచారానికి గురైన మహిళ అపస్మారక స్థితిలో పడివున్నా ఆమె అక్క కుమారుడు అక్కడికి వచ్చే వరకు ఎవరూ ఆమెను గుర్తించలేదు. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా ఆమెను సొంతూరైన మహబూబ్‌నగర్ ఎందుకు తీసుకెళ్లాడు? తన భార్య, మరదలు కనిపించకుండా పోయినా కిడ్నీ రోగి అయిన మహిళ భర్త ఆసుపత్రి వర్గాలకు చెప్పకుండా ఈ నెల 12న కుమారుడితో కలిసి మహబూబ్‌నగర్ ఎలా వెళ్లాడు? బాధితురాలు పోలీసులకు చెప్పేంత వరకు ఈ విషయం ఆసుపత్రి వర్గాలు ఎందుకు గుర్తించలేదు? వంటి విషయాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.