America: ఎట్టకేలకు బ్రిట్నీ స్పియర్స్ సంరక్షణ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్న తండ్రి!
- తన జీవితాన్ని నరక ప్రాయం చేస్తున్నాడంటూ తండ్రిపై కోర్టుకెక్కిన బ్రిట్నీ
- తప్పుకునేందుకు ముందుకొచ్చిన జేమీ స్పియర్స్
- కొత్త వ్యక్తిని నియమించే వరకు కొనసాగుతానని వెల్లడి
తన జీవితాన్ని నరకప్రాయం చేస్తున్న తండ్రి జేమీ స్పియర్స్‌ను వ్యక్తిగత సంరక్షకుడి బాధ్యతల నుంచి తప్పించాలన్న పాప్‌స్టార్ బ్రిట్నీ స్పియర్స్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. త్వరలోనే ఆయన కుమార్తె వ్యక్తిగత సంరక్షణ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. మరో సంరక్షకుడిని నియమించే వరకు ఆ బాధ్యతల్లో కొనసాగుతానని కోర్టుకు తెలిపారు. అయితే, ఎప్పటిలోగా తప్పుకుంటానన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
2008లో బ్రిట్నీ స్పియర్స్ మానసిక సమస్యలకు లోనయ్యారు. దీంతో ఆమె ఆస్తులకు, వ్యక్తిగత జీవితానికి చట్టబద్ధమైన సంరక్షకుడిగా జేమీని కోర్టు నియమించింది. అయితే, ఇటీవల బ్రిట్నీ తన తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కింది. తన జీవితంపై ఆంక్షలు విధిస్తూ జీవితాన్ని నరకంగా మార్చుతున్నాడని, నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. సంరక్షకుడి బాధ్యతల నుంచి తన తండ్రిని తొలగించి తాను సూచించిన వ్యక్తికి ఆ బాధ్యతలు ఇవ్వాలని వేడుకుంది. దీనిపై విచారణ కొనసాగుతుండగా జేమీ స్పియర్స్ స్పందించారు. కుమార్తె సంరక్షణ హోదా నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు.