Bombay High Court: ఒక ఫ్లాట్ కలిగి ఉన్న వాళ్లు నాలుగైదు కార్లు కొంటామంటే కుదరదు: బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Bombay High Court comments on parking problem

  • ముంబయిలో పార్కింగ్ సమస్య తీవ్రం
  • పిల్ దాఖలు చేసిన సామాజిక కార్యకర్త
  • విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం
  • కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

అపార్ట్ మెంట్లలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇకపై ఒక ఫ్లాట్ సొంతదారులు నాలుగైదు కార్లు కలిగి ఉండడం కుదరదని స్పష్టం చేసింది. మహారాష్ట్రలో వాహనాల పార్కింగ్ కు నిర్దిష్టమైన విధానమంటూ లేకపోవడం పట్ల న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. సొంతంగా తగినంత పార్కింగ్ స్థలం లేనివాళ్లను ఒకటి కంటే ఎక్కువ వాహనాలు కలిగి ఉండేందుకు అనుమతించవద్దని అధికారులను ఆదేశించింది.

నవీ ముంబయికి చెందిన సామాజిక కార్యకర్త సందీప్ ఠాకూర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బిల్డర్లు, డెవలపర్లు తాము నిర్మించే అపార్ట్ మెంట్లలో తగినంత పార్కింగ్ స్థలం చూపించడంలేదని, దాంతో అపార్ట్ మెంట్ వాసులు తమ నివాస సముదాయాల వెలుపల వాహనాలు నిలుపుకోవాల్సి వస్తోందని సందీప్ ఠాకూర్ తన పిటిషన్ లో వెల్లడించారు.

విచారణ సందర్భంగా పిటిషనర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. రోడ్లు వాహనాలతో క్రిక్కిరిసిపోతున్నాయని, రోడ్డుకు ఇరువైపులా 30 శాతం భాగం వాహనాల పార్కింగ్ కే సరిపోతోందని, ఎక్కడ చూసినా ఇదే తంతు అని పేర్కొంది. ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం అవసరమని, అధికారులు ఆ దిశగా సమర్థ విధానం రూపొందించాలని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది మనీష్ పాబ్లేను ఆదేశించింది.

  • Loading...

More Telugu News