Manish Maheshwari: ట్విట్టర్ ఇండియా అధిపతి మనీశ్ మహేశ్వరికి స్థాన చలనం.. అమెరికాకు బదిలీ!
- ట్విట్టర్ యాజమాన్యం కీలక నిర్ణయం
- ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు అప్పగింత
- ఇటీవల కేంద్రంతో ట్విట్టర్ యుద్ధం
- ఇదంతా జరిగింది మనీశ్ మహేశ్వరి హయాంలోనే!
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ భారత విభాగం అధిపతి మనీశ్ మహేశ్వరిని అమెరికా బదిలీ చేసింది. ఆయనను అమెరికాలోని తమ ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్టు వెల్లడించింది.
ఇటీవల భారత ప్రభుత్వం నూతన ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ ఇండియా చీఫ్ గా మనీశ్ మహేశ్వరి నియమితులయ్యారు. అయితే, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ నియామకంలో ట్విట్టర్ కు, కేంద్రానికి మధ్య ఓ మోస్తరు యుద్ధమే జరిగింది. కోర్టుల ఆదేశాలతో ట్విట్టర్ దిగొచ్చినా, అప్పటికే కేంద్రంతో తీవ్ర అంతరం ఏర్పడింది. ఇవన్నీ జరిగింది మనీశ్ మహేశ్వరి హయాంలోనే కావడంతో ఇప్పుడాయన బదిలీకి ప్రాధాన్యం ఏర్పడింది. మనీశ్ మహేశ్వరి స్థానంలో భారత్ లో ట్విట్టర్ సారథి ఎవరన్నది ఇంకా వెల్లడి కాలేదు.