Nadendla Manohar: పవన్ కల్యాణ్ కు ఎంతో ఇష్టమైన కార్యక్రమం ఇది: సభ్యత్వాల నమోదుపై నాదెండ్ల మనోహర్
- తూర్పుగోదావరిలో నాదెండ్ల పర్యటన
- క్రియాశీలక కార్యకర్తలకు కిట్లు అందజేత
- కార్యకర్తలకు అభినందనలు
- సీఎం జగన్ పై విమర్శలు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం స్వీకరించిన కార్యకర్తలకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బీమా పత్రాలు, ఐడీ కార్డులతో కూడిన కిట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సభ్యత్వాల నమోదు కార్యక్రమం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఎంతో ఇష్టమైన కార్యక్రమం అని వెల్లడించారు. అందుకే ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లే కార్యకర్తలను తప్పక అభినందించాలని పేర్కొన్నారు. ఓవైపు కరోనా విలయం సృష్టిస్తున్నప్పటికీ పవన్ కల్యాణ్ పిలుపునందుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని నాదెండ్ల మనోహర్ కొనియాడారు.
పార్టీ కోసం గ్రామ, మండల స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రమాదం జరిగినప్పుడు దేశ, విదేశాల్లో ఉన్న పార్టీ సానుభూతిపరులు స్పందించి బాధితుల కుటుంబాలను ఆదుకుంటున్నారని వివరించారు. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తులు జనసేనలో చాలామందే ఉన్నారని, వారందరి స్ఫూర్తితోనే క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. దేశంలో 20 ఏళ్లు పాలించిన పార్టీలు కూడా ఉన్నాయని, కానీ ఏ పార్టీ చేయని రీతిలో కార్యకర్తలకు రూ.5 లక్షల మేర ప్రమాద బీమా అందిస్తున్న ఏకైక పార్టీ జనసేన అని నాదెండ్ల మనోహర్ ఉద్ఘాటించారు.
అటు, నాదెండ్ల మనోహర్ పలు రాజకీమ విమర్శలు కూడా చేశారు. జగన్ నాయకత్వంపై ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోందని, ప్రభుత్వంపై విమర్శల తీవ్రత పెరిగిందని అన్నారు. విపక్షాలు ఏ కార్యక్రమం చేపట్టినా గొంతు నొక్కే ప్రయత్నాలు తప్ప, సమస్యకు పరిష్కారం ఆలోచించాలన్న జ్ఞానం అధికార పార్టీలో లోపించిందని నాదెండ్ల విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థిక లోటు వేధిస్తోందని, వేల కోట్ల రూపాయలు ఎటు పోతున్నాయో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందన్న విషయం దేశమంతా తెలిసిందని పేర్కొన్నారు.
కాగా, తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నాదెండ్ల పెద్దాపురంలోని చారిత్రక మరిడమ్మ ఆలయాన్ని సందర్శించారు. మరిడమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.