Andhra Pradesh: ఆషాఢం సారెకు మించి.. పోటీగా 10 టన్నుల స్వీట్లతో కూడిన శ్రావణం సారె పంపిన వియ్యంకుడు!
- గత నెలలో ఆషాఢం సారె పంపిన వధువు తల్లిదండ్రులు
- అంతకుమించి శ్రావణం సారె పంపిన వరుడి కుటుంబ సభ్యులు
- సారెలో 10 టన్నుల స్వీట్లు, 100 అరటిగెలలు, 2 టన్నుల పండ్లు
- సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పాలన్నదే తమ అభిమతమన్న పెళ్లి కుమార్తె తండ్రి
కుమార్తె వివాహం సందర్భంగా ఇటీవల ఆమె తల్లిదండ్రులు భారీ ఎత్తున ఆషాఢం సారె పంపగా, తాజాగా అంతకుమించిన సారె పంపాడు వియ్యంకుడు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని గాదరాడకు చెందిన ఓం శివశక్తి పీఠం వ్యవస్థాపక ధర్మకర్త బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు తమ కుమార్తె ప్రత్యూష వివాహం సందర్భంగా గత నెలలో యానాంలోని వియ్యంకుడు తోట రాజు ఇంటికి కావిళ్ల కొద్దీ ఆషాఢం సారె పంపి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీరు పంపిన వాటిలో స్వీట్స్ తో కూడిన వంద కావిళ్లు, 250 రకాల పచ్చళ్లు, చేపలు, మేకపోతులు ఉన్నాయి.
తాజాగా శ్రావణమాసం సందర్భంగా తోట రాజు కూడా యానాం నుంచి నిన్న పెద్ద ఎత్తున సారె పంపి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన పంపిన వాటిలో 10 టన్నుల స్వీట్లు, 100 అరటిగెలలు, పలు రకాల పండ్లు 2 టన్నులు, నూతన వస్త్రాలు, వివిధ రకాల పుష్పాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా ప్రత్యూష తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కరోనా లేకపోయి ఉంటే తమ కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయాలనుకున్నామని, కానీ కుదరలేదని అన్నారు. ఈ కారణంగానే సారెను భారీగా పంపినట్టు చెప్పారు. ఇంత భారీ ఎత్తున సారె పంపడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినప్పటికీ మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజెప్పాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.