Chiranjeevi: 'మా' ఎన్నికలపై కృష్ణంరాజుకు లేఖ రాసిన చిరంజీవి

Chiranjeevi wrote Krishnamraju on MAA Elections

  • సెప్టెంబరులో 'మా' ఎన్నికలు
  • త్వరగా ఎన్నికలు జరిపించాలన్న చిరు
  • ప్రస్తుతం ఆపద్ధర్మ కార్యవర్గం కొనసాగుతోందని వెల్లడి
  • కృష్ణంరాజు మాట అందరూ గౌరవిస్తారని వివరణ

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'మా' ప్రస్తుతం ఆపద్ధర్మ కార్యవర్గం సాయంతో నడుస్తోందని, త్వరలోనే ఎన్నికలు జరిపించాలని స్పష్టం చేశారు. ఎన్నికలు ఆలస్యం అయితే సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు 'మా' క్రమశిక్షణ కమిటీ చైర్మన్, సీనియర్ నటుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు.

"కరోనా పరిస్థితుల వల్ల 'మా' కార్యవర్గ ఎన్నిక  వాయిదా పడింది. ప్రస్తుతం ఆపద్ధర్మ కార్యవర్గం కొనసాగుతోంది. ఆపద్ధర్మ కార్యవర్గాన్ని ఎక్కువకాలం కొనసాగించడం మంచి పరిణామం కాదు. ఈ కార్యవర్గానికి నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు ఉండదు. మీరు తెలుగు సినీ రంగంలో గౌరవనీయ వ్యక్తి. సీనియర్ గా, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మీ మార్గదర్శకత్వంలో 'మా' ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా, సజావుగా జరుగుతాయన్న నమ్మకం నాకు ఉంది.

ఇటీవల కాలంలో బార్ కౌన్సిల్ ఎన్నికలు, మరికొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో, 'మా' ఎన్నికలు కూడా సజావుగా నిర్వహించుకోవచ్చు. నూతన కార్యవర్గం ఎన్నికైతే పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించుకోవచ్చు. పలు కార్యక్రమాల నిర్వహణకు మార్గం సుగమం అవుతుంది. అందుకే ఏ విధంగా చూసినా 'మా' ఎన్నికల నిర్వహణ ఓ తక్షణ అవసరం.

మీకు అన్ని విషయాలు తెలుసు. మీ మాటకు తెలుగు సినీ పరిశ్రమ ఎనలేని గౌరవం ఇస్తుంది. మీ మార్గదర్శకత్వంలో చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను" అంటూ చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు.

కాగా, ఇటీవల కొందరు మా సభ్యులు మీడియా ముందుకు వెళ్లి తమ వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చడం వల్ల గందరగోళం ఏర్పడుతోందని వెల్లడించారు. ఈ పద్ధతిని నియంత్రించాల్సిన అవసరం ఉందని, తెలుగు సినీ పరిశ్రమకు ఇంతటి గుర్తింపు, గౌరవం లభించడానికి ఏ ఒక్కరో కారణం కాదని, అందరి కృషి ఉందని చిరంజీవి స్పష్టం చేశారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే వాటిని సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని, బహిరంగ విమర్శలు చేయడం ఎవరికీ సరైనది కాదని అభిప్రాయపడ్డారు.

'మా' ఎన్నికలు సెప్టెంబరులో జరగనున్నాయి. ఈసారి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ వంటి ప్రముఖులు 'మా' అధ్యక్ష రేసులో ఉన్నారు.

  • Loading...

More Telugu News