Birth Certificate: బర్త్, డెత్ సర్టిఫికెట్లను పొందడం మరింత సులభతరం.. కొత్త సిస్టమ్ ను తీసుకొస్తున్న జీహెచ్ఎంసీ!
- ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ను తీసుకొస్తున్న జీహెచ్ఎంసీ
- జనన, మరణ వివరాలను పోర్టల్ లో అప్ లోడ్ చేయనున్న ఆసుపత్రులు
- మీసేవ నుంచి నేరుగా సర్టిఫికెట్లను పొందే అవకాశం
జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను (బర్త్, డెత్ సర్టిఫికెట్లు) పొందడంలో ఆలస్యాన్ని నివారించడానికి జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సర్టిఫికెట్లను ప్రజలు సులభంగా పొందేందుకు వీలుగా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ను తీసుకొస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా తీసుకొస్తున్న ఈ ప్లాట్ ఫామ్ ను ఇప్పటికే పరీక్షించారు. త్వరలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది.
జనన, మరణాలకు సంబంధించిన అన్ని వివరాలను రెండు నెలల్లోగా పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని గ్రేటర్ పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రులకు జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ, కొత్త విధానం ద్వారా సర్టిఫికెట్లను జారీ చేసే ప్రక్రియను తాము సమీక్షిస్తున్నామని... ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు.
ఈ ఆన్ లైన్ పోర్టల్ అందుబాటులోకి వస్తే సర్టిఫికెట్లను పొందడం అత్యంత సులభతరమవుతుంది. సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో దరఖాస్తు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఆసుపత్రులు జనన, మరణాల వివరాలను పోర్టల్ లో అప్ లోడ్ చేసిన తర్వాత... వారంలోగా సర్టిఫికెట్లను పొందే అవకాశం ఉంటుంది.
డెత్ సర్టిఫికెట్ ను రెండు విధాలుగా పొందే అవకాశం ఉంది. ఎవరైనా వ్యక్తి ఇంటి వద్ద మరణించినట్టయితే... అంత్యక్రియలను నిర్వహించిన శ్మశానం వద్ద నుంచి రసీదు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రసీదును జీహెచ్ఎంసీ సిటిజెన్ సర్వీస్ సెంటర్ లో అందజేయాలి. ఆ తర్వాత మీసేవ నుంచి డెత్ సర్టిఫికెట్ ను పొందవచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి ఆసుపత్రిలో మరణించినట్టైతే... ఆసుపత్రి సిబ్బంది ఆ వివరాలను నేరుగా పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు.
ఆసుపత్రి వర్గాలు అప్ లోడ్ చేసే జనన, మరణ వివరాలను జీహెచ్ఎంసీలో ఆ విభాగానికి సంబంధించిన రిజిస్ట్రార్ అప్రూవ్ చేస్తారు. అనంతరం సంబంధిత సర్టిఫికెట్లను మీసేవ ద్వారా పొందవచ్చు. 'మై జీహెచ్ఎంసీ' యాప్ ద్వారా కూడా డిజిటల్ సర్టిఫికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.