Amararaja: అమరరాజా తరలింపు వార్తలపై స్పందించిన సీపీఐ నారాయణ

CPI Narayana responds on Amraraja Batteries

  • పరిశ్రమను ప్రభుత్వమే వెళ్లగొడుతోంది
  • రాజధాని రైతులపై పోలీసుల దమనకాండ తగదు
  • జగన్ కోర్టుకు భయపడతారు.. అందుకే ఉద్యమాన్ని అడ్డుకుంటున్నారు: రామకృష్ణ

ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అమరరాజా ఏపీ నుంచి తరలిపోతోందన్న వార్తలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. విజయవాడలోని దాసరి భవన్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన నారాయణ.. ప్రభుత్వ తీరు వల్లే సంస్థ తరలిపోతోందని అన్నారు. అయినా, తరలిపోవడానికి ఇదేమైనా సూటకేస్ పరిశ్రమా? అని అన్నారు.

ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని, లక్షలాదిమంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. కాలుష్యానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని, అంతేకానీ పరిశ్రమను వెళ్లగొట్టడం తగదని హితవు పలికారు.

అమరావతి ఉద్యమంపై మాట్లాడుతూ.. 600 రోజులుగా శాంతియుతంగా ఉద్యమం జరుగుతోందని, ఉద్యమకారులపై పోలీసుల నిర్బంధకాండ తగదని, దీనిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని సమస్యపై ప్రధాని మోదీ స్పందించాలని నారాయణ డిమాండ్ చేశారు. ఇదే సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ ఎవరికీ భయపడరు కానీ, కోర్టులకు మాత్రం భయపడతారని, అందుకనే న్యాయస్థానాల ఎదుట రైతులు ఉద్యమిస్తుంటే పోలీసులను ప్రయోగించి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

Amararaja
CPI Narayana
CPI Ramakrishna
Andhra Pradesh
Amravathi
  • Loading...

More Telugu News