Nara Lokesh: అమరావతి పేరు వింటేనే జగన్ వణికిపోతున్నాడు: నారా లోకేశ్
- అమరావతి ఉద్యమానికి 600 రోజులు
- ర్యాలీకి పిలుపునిచ్చిన జేఏసీ
- అడ్డుకున్న పోలీసులు
- ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్
జై అమరావతి పోరాటం 600 రోజులకు చేరిన సందర్భంగా రాజధాని రైతులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. అమరావతి పేరు వింటేనే జగన్ వణికిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజా రాజధాని పరిరక్షణ ఉద్యమం జగన్ ప్రభుత్వం అణచివేతకి ఎదురొడ్డి నిలిచి మహా ఉద్యమం అయిందని వివరించారు.
రైతుల దీక్షకు 600 రోజులైన సందర్భంగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యమకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారని లోకేశ్ ఆరోపించారు. వారిని వ్యాన్లలో కుక్కారని, సెల్ లో బంధించారని మండిపడ్డారు. రైతుల కాళ్లు విరగ్గొట్టారని, మహిళల పట్ల మగ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంపై ప్రభుత్వ అణచివేత బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు మీడియా ప్రతినిధుల్ని కూడా నిర్బంధించారని లోకేశ్ వెల్లడించారు.
అయితే, ఖాకీల వలయాన్ని ఛేదించుకుని మంగళగిరి దేవస్థానం చేరి జై అమరావతి అని నినదించిన రైతులు, మహిళలు, టీడీపీ నేతలు, ఉద్యమకారులను జైళ్లలో బందీలుగా చేశారని ఆరోపించారు. బందీలుగా ఉన్న వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. "న్యాయమైన మీ పోరాటానిదే అంతిమ విజయం... అమరావతి శాశ్వతం" అని ఉద్ఘాటించారు.