Neeraj Chopra: తనకెంతో ఇష్టమైన వంటకాన్ని పక్కన పెట్టేసిన నీరజ్ చోప్రా.. ఆ ఒక్కటి తప్ప!
- ఒలింపిక్స్ కోసం ఆహార నియమాలు
- తనకు ఇష్టమైన ‘చుర్మా’ను వదిలేసిన వైనం
- పానీపూరీలు మాత్రం ఓకే అన్న గోల్డెన్ బాయ్
అథ్లెటిక్స్ చరిత్రలోనే ఒలింపిక్స్ లో తొలి మెడల్ సాధించి పెట్టాడు నీరజ్ చోప్రా. అదీ బంగారం తెచ్చాడు. అయితే, అందుకోసం అతడు నోరు బాగానే కట్టేసుకున్నాడు. ఇష్టమైన ఆహారాన్ని పక్కకుపెట్టాడు. కానీ, ఒక్కటి తప్ప! బల్లేన్ని 87.58 మీటర్ల దూరం విసిరి పసిడి పట్టిన నీరజ్ చోప్రా.. తనకు ఇష్టమైన వంటకం గురించి ఈఎస్ పీఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
‘పానీపూరీ (గోల్ గప్ప)’ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఆహారం విషయంలో తాను ఎన్ని ఆంక్షలు పెట్టుకున్నా పానీపూరీ విషయంలో మాత్రం ఆ నియమాలేవీ లేవన్నాడు. ‘‘పానీపూరీలు తింటే ఏ హాని జరగదు. అది మొత్తం నీళ్లే. వాటిని తిన్నా కడుపంతా నీటితోనే నిండుతుంది. పిండి ఉండేది కొద్ది మొత్తంలోనే. అంటే రోజూ తినాలని నేను చెప్పట్లేదు. కానీ, అప్పుడప్పుడు తినడంలో తప్పులేదు’’ అని నీరజ్ చెప్పుకొచ్చాడు.
ఇక, నీరజ్ కు ఇంట్లో చేసిన ‘చుర్మా (రొట్టెలను నెయ్యి, చక్కెరతో కలిపి చేసే వంటకం)’ అంటే చాలా ఇష్టమని నీరజ్ తల్లి సరోజ్ దేవి చెప్పారు. ఒలింపిక్స్ కోసం నీరజ్ ఎంతో కష్టపడ్డాడని, తనకు ఇష్టమైన వంటలన్నింటినీ దూరం పెట్టాడని అన్నారు. నీరజ్ ఇంటికి రాగానే తనకెంతో ఇష్టమైన చుర్మాను చేసి తన చేతులతో తినిపిస్తానని చెప్పారు. జంక్ ఫుడ్ కు నీరజ్ దూరంగా ఉన్నాడని అతడి సోదరి తెలిపారు. స్వీట్ల జోలికి అస్సలు పోలేదన్నారు.