Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లకు తీరని నష్టం.. వైమానిక దాడుల్లో 200 మందికిపైగా హతం
- షెబెర్ఘాన్ నగరంలో తాలిబన్ స్థావరాలపై బి-52 బాంబుల వర్షం
- ఆయుధాలు, పేలుడు పదార్థాలు, వాహనాలు పెద్ద ఎత్తున ధ్వంసం
- గత 24 గంటల్లో 385 మంది తాలిబన్లు హతం
ఆఫ్ఘనిస్థాన్‌లో చెలరేగిపోతున్న తాలిబన్లకు నిన్న గట్టి ఎదురుదెబ్బ తగిలింది. షెబెర్ఘాన్ నగరంలోని తాలిబన్ స్థావరాలపై జరిగిన వైమానిక దాడుల్లో 200 మందికిపైగా తాలిబన్లు హతమయ్యారు. వైమానిక దాడుల్లో 200 మందికిపైగా తాలిబన్లు హతమయ్యారని, పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలతోపాటు తాలిబన్లకు చెందిన వందలాది వాహనాలు ధ్వంసమైనట్టు ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఫవాద్ అమన్ తెలిపారు.
జావ్జాన్ ప్రావిన్స్‌లోని షెబెర్ఘాన్ నగరంలోని తాలిబన్ల స్థావరాలపై నిన్న సాయంత్రం 6.30 గంటల సమయంలో బి-52 బాంబర్ విమానం బాంబుల వర్షం కురిపించింది. అమెరికా వైమానిక దళం జరిపిన ఈ దాడిలో తాలిబన్ల వైపు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింద
కాగా, అంతకుముందు ఘజ్ని ప్రావిన్సియల్ సెంటర్లో పౌరులను హతమారుస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదిని ఆఫ్ఘాన్ కమాండో దళాలు పట్టుకున్నాయి. జవ్జాన్ ప్రావిన్స్‌లో వారాల తరబడి జరిగిన ఘర్షణల అనంతరం దీని రాజధాని అయిన షెబెర్ఘాన్ తాలిబన్ల వశమైంది. గత రెండు రోజుల్లో తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిన రెండో ప్రావిన్షియల్ రాజధాని ఇదే.
నంగర్హార్, లోగర్, గజనీ, పక్తికా, మైదాన్ వార్దక్, కాందహార్, హెరాత్, ఫరా, జౌజ్జాన్, సమంగాన్, హెల్మాండ్, తఖర్, బాగ్లాన్, కపిసా ప్రావిన్స్‌లలో ఏఎన్డీఎస్ఎఫ్ ఆపరేషన్ల ఫలితంగా గత 24 గంటల్లో 385 మంది తాలిబాన్ ఉగ్రవాదులు మరణించగా, 210 మంది గాయపడ్డారు.