Teenmaar Mallanna: పోలీసులు వేధిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన తీన్మార్ మల్లన్న
- తీన్మార్ మల్లన్నపై కేసుల నమోదు
- జ్యోతిష్యాలయం నిర్వాహకుడ్ని బెదిరించినట్టు ఆరోపణలు
- ఆన్ లైన్ లో విచారణ జరిపేలా ఆదేశించాలని కోరిన మల్లన్న
తీన్మార్ మల్లన్నపై ఇటీవల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై తీన్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించారు. తనపై కేసుల నమోదు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ నెల 3న తనకు నోటీసులు ఇచ్చారని, రెండ్రోజుల్లోనే విచారణకు పిలిచారని వాపోయారు.
హైదరాబాదులోని మారుతీ జ్యోతిష్యాలయం నిర్వాహకుడు లక్ష్మీకాంతశర్మను డబ్బులు డిమాండ్ చేశాడన్న ఫిర్యాదుపై తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీసీఎస్, చిలకలగూడ పీఎస్ లో కేసులు నమోదయ్యాయని, దర్యాప్తు పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో విచారణ జరిపేలా ఆదేశించాలని తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.