Andhra Pradesh: పోలీసులే నా కారు సైడ్​ అద్దం పగులగొట్టి తీసుకెళ్లారు.. 15 గంటలు కుర్చీలో కూర్చోబెట్టారు: దేవినేని ఉమ

Devineni Uma Released From Jail

  • రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల
  • రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేదని విమర్శ
  • వైసీపీ నేతలు దాడిచేసినప్పుడు ఒక్క పోలీసూ కాపాడలేదని కామెంట్

రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, చట్టబద్ధమైన పాలన లేదని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. సెంట్రల్ జైలు నుంచి బయటకొచ్చిన తనను మీడియాతో మాట్లాడనివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణమని, ఇంత అరాచకమా? అని ఆయన ప్రశ్నించారు. ఇవాళ ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

కృష్ణా జిల్లాకు చెందిన నేతలను ఇక్కడిదాకా తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. అక్రమాలను ప్రశ్నించినందుకు అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. తనపై వైసీపీ నేతలు దాడి చేసినప్పుడు ఏ ఒక్క పోలీసూ తనను కాపాడలేదన్నారు. పార్టీ కార్యకర్తలే తనను కాపాడే ప్రయత్నం చేశారని, అప్పుడు పోలీసులొచ్చి తన కారును చుట్టుముట్టి సైడ్ అద్దం పగులగొట్టారని ఆరోపించారు. అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీస్ కారులో తీసుకెళ్లారన్నారు.  

ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో దాదాపు 15 గంటల పాటు కుర్చీలోనే కూర్చోబెట్టారని, వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారని దేవినేని ఆరోపించారు. న్యాయదేవత, న్యాయస్థానాల దయతో బయటకొచ్చానని ఆయన అన్నారు. న్యాయస్థానాలే రాజ్యాంగాన్ని కాపాడుతున్నాయన్నారు. పునికిచెట్లు, ఆయుర్వేద చెట్లు, గ్రావెల్ ను విచ్చలవిడిగా దోచేస్తున్నారని, ఆ అరాచకాన్ని ప్రశ్నించినందుకే తనను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News