Ravi Kumar Dahiya: చివరి 30 సెకన్లలో ఉడుం పట్టు... టోక్యో ఒలింపిక్స్ లో ఫైనల్స్ కు దూసుకెళ్లిన రెజ్లర్ రవికుమార్ దహియా
- 57 కిలోల విభాగంలో రవికుమార్ ఘనవిజయం
- ఓ దశలో 2-9తో వెనుకబడిన వైనం
- చివరి 30 సెకన్లలో అద్భుతం చేసిన రవికుమార్
- ప్రత్యర్థిని ఫాలౌట్ చేసిన వైనం
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం ఖాయమైంది. రెజ్లింగ్ లో రవికుమార్ దహియా తన విజయప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఫైనల్లో ప్రవేశించాడు. 57 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో రవికుమార్ దహియా కజకిస్థాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్ పై అద్భుతం అనదగ్గ రీతిలో నెగ్గాడు. 'దంగల్' సినిమా క్లైమాక్స్ లో గీతా ఫోగాట్ తన ప్రత్యర్థిని చివరి నిమిషంలో ఎలా చిత్తు చేస్తుందో, ఈ పోరులో రవికుమార్ కూడా అదే చేశాడు.
ఓ దశలో రవికుమార్ 2-9తో వెనుకబడి ఉండగా, అప్పటికి మ్యాచ్ ముగిసేందుకు 30 సెకన్ల సమయం మాత్రమే మిగిలుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్ గెలవలేని స్థితిలో రవికుమార్ తన ప్రత్యర్థి నూర్లిసామ్ సనయేవ్ ను దొరకబచ్చుకుని ఉడుం పట్టు పట్టాడు. తద్వారా ప్రత్యర్థిని ఫాలౌట్ చేశాడు. దాంతో మ్యాచ్ లో విజయంతో పాటు పతకం కూడా ఖాయమైంది.
కాగా, రవికుమార్ ఫైనల్లో రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) జట్టుకు చెందిన ఉగుయేవ్ తో తలపడనున్నాడు.