COVID19: కరోనా కట్టడిపై కేంద్ర నిబంధనలను కేరళ అస్సలు పట్టించుకోవట్లేదు: కేంద్రానికి సెంట్రల్ టీమ్ నివేదిక
- హోంఐసోలేషన్ పేషెంట్లపై పర్యవేక్షణ కరవు
- ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి
- కాంటాక్ట్ ట్రేసింగ్ చాలా చాలా అధమం
- ఆర్టీపీసీఆర్ టెస్టులూ చాలా తక్కువ
- 80% దాకా యాంటీ జెన్ టెస్టులే
కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను కేరళ అస్సలు పాటించట్లేదని, హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్లను సరిగ్గా పర్యవేక్షించట్లేదని సెంట్రల్ టీమ్ అసహనం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖకు వివరించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)కి చెందిన ఆరుగురు సభ్యుల టీమ్ ను కేంద్రం గత వారం కేరళకు పంపించిన సంగతి తెలిసిందే.
ఆ వివరాలను తాజాగా కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ టీమ్ సమర్పించింది. కరోనా బారిన పడిన 90 శాతం మంది బాధితులు హోం ఐసోలేషన్ లోనే ఉంటున్నారని అందులో పేర్కొంది. అయితే, హోం ఐసోలేషన్ నిబంధనలను సరిగ్గా అమలు చేయట్లేదని, కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.
కరోనా సోకినవారి కాంటాక్ట్ ల గుర్తింపూ చాలా చాలా అధమ స్థాయిలో ఉందని ఆక్షేపించింది. 1:20గా ఉండాల్సిన కాంటాక్ట్ ట్రేసింగ్.. కేవలం 1:1.5 గానే ఉందని తెలిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను చాలా తక్కువగా చేస్తున్నారని, 80 శాతం వరకు యాంటీజెన్ టెస్టులపైనే ఆధారపడుతున్నారని తెలిపింది.
కంటెయిన్ మెంట్, మైక్రో కంటెయిన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేసినా.. ఎక్కడా కేంద్ర నిబంధనలను అనుసరించలేదని సెంట్రల్ టీమ్ తన నివేదికలో పేర్కొంది. చాలా వరకు ఆ జోన్ల చుట్టుపక్కల బఫర్ జోన్లను ఏర్పాటు చేయలేదని తెలిపింది. ఉన్న చోట అమలు కఠినంగా లేదని అసహనం వ్యక్తం చేసింది.
కాగా, మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 20 వేల కేసులు నమోదయ్యాయి. 148 మంది చనిపోయారు. పాజిటివిటీ రేటు 11.48 శాతంగా ఉంది. రోజూ కేసులు పెరుగుతున్నా.. దేశంలోని రోజువారీ కేసుల్లో సగం దాకా అక్కడే వస్తున్నా అన్నింటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
కేవలం ఆదివారాల్లోనే లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఇవాళ ప్రకటించారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో అన్ని షాపులూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. పాజిటివిటీ రేటు వెయ్యికి పదిగా ఉంటే ఆయా చోట్ల ట్రిపుల్ లాక్ డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు.