Lakshmi Parvati: తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగు అకాడమీని నిర్వీర్యం చేశారు: లక్ష్మీపార్వతి విమర్శలు
- 30 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేశారు
- తెలుగును సంస్కృతం దెబ్బతీయలేదు
- తెలుగు అకాడమీ బైలాను మార్చలేదని వెల్లడి
తెలుగు అకాడమీ పరిస్థితి దారుణంగా ఉందని ఆ సంస్థ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. అకాడమీని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఆశగా ఉన్నప్పటికీ... పరిస్థితులు మాత్రం దానికి అనుకూలంగా లేవని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగు అకాడమీని నిర్వీర్యం చేశారని తెలిపారు. తెలుగు అనే పేరు లేకుండా చేశారని... రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేశారని మండిపడ్డారు. తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని చేర్చడం వల్ల వచ్చే నష్టమేమీ లేదని అన్నారు.
తెలుగు భాషకు సంస్కృత భాష ఒక ఉపలబ్ధి మాత్రమేనని లక్ష్మీపార్వతి చెప్పారు. తెలుగు భాషను సంస్కృతం దెబ్బతీయలేదని అన్నారు. తెలుగు అకాడమీ బైలాను మార్చలేదని తెలిపారు. తాను కానీ, తన తర్వాత వచ్చే మరో ఛైర్మన్ కానీ తెలుగు అకాడమీ వైభవాన్ని దెబ్బతీయలేరని అన్నారు. తెలుగు అకాడమీ ద్వారా ఇంటర్మీడియట్ పుస్తకాల ముద్రణకు ప్రభుత్వం అనుమతించిందని... వారం రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ పుస్తకాలను ఆవిష్కరింపజేస్తామని చెప్పారు. నాడు-నేడు పథకం ద్వారా విద్యాభ్యాసానికి జగన్ అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు.