PV Sindhu: సింధుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు సంపూర్ణ సహకారం అందించారు: పీవీ రమణ
- టోక్యో ఒలింపిక్స్ లో సింధుకు కాంస్యం
- ఉప్పొంగుతున్న భారతావని
- సింధు కుటుంబంలో సంతోషం
- జగన్, కేసీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపిన రమణ
టోక్యో ఒలింపిక్స్ లో సింధు బ్యాడ్మింటన్ కాంస్యం అందుకోవడం పట్ల పీవీ రమణ పుత్రికోత్సాహం పొందుతున్నారు. నిన్న సెమీస్ లో ఓడిన సింధు ఇవాళ అద్భుతంగా పుంజుకోవడం పట్ల ఆమె కుటుంబ సభ్యుల్లో సంతోషం ద్విగుణీకృతమైంది. ఈ నేపథ్యంలో, సింధు తండ్రి పీవీ రమణ మీడియాతో మాట్లాడుతూ, తమ ఆనందాన్ని పంచుకున్నారు. తన కుమార్తె ఒలింపిక్ క్రీడల్లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా నిలవడం హర్షణీయం అని పేర్కొన్నారు.
నిన్న సెమీస్ లో ఓటమి తర్వాత సింధు కళ్లలో నీళ్లు చూశానని, తన కోసం పతకం గెలవాలని ఆమెకు సూచించానని రమణ వెల్లడించారు. చైనా షట్లర్ బింగ్జియావో ఆటతీరుపై అవగాహన వచ్చేలా పలు వీడియోలు కూడా పంపానని తెలిపారు. సింధు ఈ నెల 3న భారత్ తిరిగి వస్తోందని వెల్లడించారు.
ఒలింపిక్ ప్రస్థానం దిశగా తన కుమార్తె సింధుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ సంపూర్ణ సహకారం అందించారని కొనియాడారు. వారిద్దరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా, ఏపీ సీఎం జగన్, ఆయన అర్ధాంగి వైఎస్ భారతిలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఒలింపిక్స్ కు వెళ్లేముందు, కచ్చితంగా పతకం తేవాలంటూ సింధుకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారని రమణ వివరించారు.
అటు, సింధు కోచ్ పార్క్ తై సేంగ్ కు కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. సింధు కోసం పార్క్ ఎంతో శ్రమించాడని కితాబిచ్చారు.