Venkaiah Naidu: హైదరాబాదులో భారత్ బయోటెక్ ను సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- జీనోమ్ వ్యాలీలో వెంకయ్య పర్యటన
- భారత్ బయోటెక్ సందర్శన సంతోషదాయకమని వెల్లడి
- తక్షణావసరం వ్యాక్సినేషన్ అని వివరణ
- ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ హైదరాబాదులోని జీనోమ్ వ్యాలీలో పర్యటించారు. ఇక్కడి భారత్ బయోటెక్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారత్ బయోటెక్ ను సందర్శించడం సంతోషదాయకం అని పేర్కొన్నారు. పలు విధాలుగా రూపాంతరం చెందుతున్న కరోనా వైరస్ ఊహించని సవాళ్లు విసురుతోందని, ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషించాల్సిన పరిస్థితి కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఉన్న తక్షణావసరం మాత్రం వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడమేనని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తీసుకోకుండా వెనుకంజ వేయడం తగదని, వ్యాక్సినేషన్ డ్రైవ్ అఖిల భారతస్థాయిలో కొనసాగాలని ఆకాంక్షించారు. వ్యాక్సిన్లు తీసుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కరోనా కేసులు తాత్కాలికంగా తగ్గిపోయినంత మాత్రాన ఉదాసీనతకు తావివ్వరాదని వెంకయ్య స్పష్టం చేశారు. ఈ విరామాన్ని మరింత శక్తిని సముపార్జించుకునేందుకు అవకాశంగా భావించాలని, వైద్యపరంగా ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా, ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో, అంకితభావంతో ఎదుర్కొనేందుకు ఈ వ్యవధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.