Digvijay Singh: పెగాసస్ పై చర్చించడానికి మోదీ, అమిత్ షా ఎందుకు భయపడుతున్నారు?: దిగ్విజయ్
- దేశ భద్రతపై మోదీ, అమిత్ షాలకు చిత్తశుద్ధి లేదు
- వాస్తవాలను వారిద్దరూ దాస్తున్నారు
- రాజ్యసభలో చర్చించాలని నోటీసు ఇచ్చాను
పెగాసస్ స్పైవేర్ అంశం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. పార్లమెంటును ఈ అంశం కుదిపేస్తోంది. ఈ అంశంపై చర్చ చేపట్టాలని ఉభయసభల్లో విపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
పెగాసస్ పై పార్లమెంటులో చర్చించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అంతర్గత భద్రత, మాదకద్రవ్యాలకు సంబంధించి ఏ నేరగాడిపైన అయినా చట్టబద్ధమైన నిఘా ఉంచడంలో తప్పులేదని అన్నారు. అయితే మన మొత్తం సమాచారం ఎన్ఎస్ఓ, ఇజ్రాయెలీలు తెలుసుకోవడానికి అవకాశం కల్పించకూడదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఈ అంశాన్ని 2019లో రాజ్యసభలో తాను లేవనెత్తానని... అయితే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అప్పటి ఐటీ మంత్రి ముఖం చాటేశారని దిగ్విజయ్ దుయ్యబట్టారు. పెగాసస్ పై రాజ్యసభలో ఈరోజు చర్చించాలని తాను నోటీసు ఇచ్చానని... దీనిపై చర్చకు మోదీ, అమిత్ షా పూర్తిగా సహకరిస్తారనే తాను భావిస్తున్నానని చెప్పారు.
దేశ భద్రతపై మోదీ, అమిత్ షాలకు చిత్తశుద్ది లేదని... వాస్తవాలను వారిద్దరూ దాస్తున్నారని దిగ్విజయ్ విమర్శించారు. పెగాసస్ పై దర్యాప్తుకు ఇజ్రాయెల్ ఆదేశించిందని... అలాంటప్పుడు మోదీ, అమిత్ షాలకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. జాతీయ భద్రతపై వీరిద్దరికీ ఎలాంటి ఆందోళన లేదా? అని విమర్శించారు.