Mehul Choksi: ఆంటిగ్వా దేశానికి కరోనా వ్యాక్సిన్లు అందించి నన్ను కిడ్నాప్ చేయించారు: మేహుల్ చోక్సీ కొత్త వాదన
- పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు చోక్సీ
- ఇటీవల డొమినికాలో పట్టుబడిన వైనం
- బెయిల్ పై విడుదల
- 2019 నుంచే తన కిడ్నాప్ కు యత్నించారని వెల్లడి
పీఎన్బీ బ్యాంకు స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీ ఇటీవలే కరీబియన్ దీవుల్లో పట్టుబడ్డాడు. అయితే, తనను కిడ్నాప్ చేసి అరెస్ట్ చేశారని చోక్సీ ఆరోపిస్తున్నాడు. ఆంటిగ్వా అండ్ బార్బుడా దేశానికి భారత్ కరోనా వ్యాక్సిన్లు అందించిందని, అందుకు ప్రత్యుపకారంగా ఆంటిగ్వాలో తన కిడ్నాప్ జరిగిందని చోక్సీ కొత్త వాదన వినిపిస్తున్నాడు.
భారత్ కు చెందిన గూఢచార సంస్థ రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్)కు చెందిన గుర్మీత్ సింగ్, గుర్జీత్ భండాల్ తనను కిడ్నాప్ చేశారని వెల్లడించాడు. రా ఏజెంట్లుగా చెప్పుకునే వారిద్దరి వ్యవహారం కథలుకథలుగా విన్నానని తెలిపాడు. 2019 నుంచే తన కిడ్నాప్ కు ప్రయత్నాలు జరిగాయని, ఏకంగా ఓ విమానం కూడా వచ్చిందని, తనను కొందరు రహస్యంగా గమనించేవాళ్లని వెల్లడించాడు.
ఇటీవల డొమినికాలో అరెస్టయిన చోక్సీకి అక్కడి న్యాయస్థానం వైద్యపరమైన కారణాలతో బెయిల్ ఇచ్చింది. దాంతో అతడిని స్వదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగింది.