Gorantla Butchaiah Chowdary: తూర్పుగోదావరి జిల్లాలో నీట్ పరీక్ష కేంద్రం కోరుతూ సీఎం జగన్ లేఖ రాయాలి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- త్వరలో వైద్య విద్య ప్రవేశాల అర్హత పరీక్ష 'నీట్'
- ఏపీలో కొన్నిచోట్ల మాత్రమే పరీక్ష కేంద్రాలున్నాయన్న గోరంట్ల
- విద్యార్థులకు మేలు జరుగుతుందని వెల్లడి
జాతీయస్థాయిలో వైద్య విద్య ప్రవేశాల అర్హత పరీక్ష నీట్ త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఏపీలో నీట్ పరీక్ష కేంద్రాలు గుంటూరు జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1, విశాఖలో 1, కర్నూలు జిల్లాలో 1 కేటాయించారని వివరించారు. అయితే, ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్దదైన తూర్పు గోదావరి జిల్లాకు కూడా నీట్ పరీక్ష కేంద్రం కేటాయిస్తే వేల మంది విద్యార్ధులకు ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీయే), ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
దీనిపై సీఎం జగన్ కూడా స్పందించాలని, తూర్పు గోదావరి జిల్లాకు నీట్ పరీక్ష కేంద్రం కేటాయించాలని కోరుతూ నీట్ బోర్డుకు లేఖ రాయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా కరోనా నేపథ్యంలో ఉభయ గోదావరి ప్రాంత విద్యార్థులకు మేలు చేసిన వారవుతారని తెలిపారు. సీఎం ఈ దిశగా ఆలోచించాలని గోరంట్ల సూచించారు.