IPL-14: ఐపీఎల్ మిగిలిన భాగం షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
- భారత్ లో నిలిచిపోయిన ఐపీఎల్ పోటీలు
- కరోనా వ్యాప్తితో వాయిదా వేసిన బీసీసీఐ
- యూఏఈ గడ్డపై జరిపేలా రీషెడ్యూల్
- సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు పోటీలు
ఐపీఎల్ 14వ సీజన్ భారత్ లో కరోనా పరిస్థితుల కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాంతో, మిగిలిన మ్యాచ్ లను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలో నేడు షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబరు 19న దుబాయ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ తో ఐపీఎల్ 14వ సీజన్ పునఃప్రారంభం అవుతుంది. అక్టోబరు 15 వరకు టోర్నీ జరగనుంది.
మొత్తం 27 రోజుల పాటు యూఏఈ గడ్డపై 31 ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. దుబాయ్ లో 13 మ్యాచ్ లు, షార్జాలో 10 మ్యాచ్ లు, అబుదాబిలో 8 మ్యాచ్ లు నిర్వహిస్తారు. లీగ్ పోటీల అనంతరం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ అక్టోబరు 10న దుబాయ్ వేదికగా జరగనుంది. అనంతరం షార్జా వేదికగా అక్టోబరు 11న ఎలిమినేటర్ మ్యాచ్, అక్టోబరు 13న రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనున్నాయి. ఇక దుబాయ్ వేదికగా అక్టోబరు 15న నిర్వహించే ఫైనల్ మ్యాచ్ తో టోర్నీ ముగియనుంది.