Punjab: రైతుల ఆందోళన శిబిరాల్లో వరుస అగ్నిప్రమాదాలు.. అనుమానం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

Fire At Farmers Protest Site On Singhu Border

  • నిన్న సాయంత్రం ఐదున్నర గంటలకు అగ్ని ప్రమాదం
  • అగ్నికి ఆహుతైన టెంట్లు
  • ఎవరో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారని అనుమానం
  • తనను ఆహ్వానిస్తే వచ్చి కలుస్తానన్న సిద్ధూ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల శిబిరాల్లో వరస అగ్నిప్రమాదాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిన్న సాయంత్రం ఓ శిబిరంలో రెండు టెంట్లు అగ్నికి ఆహుతి కాగా, ఆ తర్వాత కాసేపటికే మరో శిబిరంలో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై రైతు సుఖ్వీందర్ సింగ్ అనుమానం వ్యక్తం చేశాడు. సాయంత్రం 5.30 గంటలకు మొదటి గుడారంలో అగ్ని ప్రమాదం సంభవించిందని,  ఆ తర్వాత కాసేపటికే అక్కడికి 100 మీటర్ల దూరంలో ఉన్న రెండో గుడారంలోనూ మంటలు అంటుకున్నాయని పేర్కొన్నారు.

ఎవరో వచ్చి కావాలనే ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంపై స్పందించిన కిసాన్ మోర్చా.. ఎవరు ఎన్ని చేసినా తమ స్ఫూర్తిని దెబ్బతీయలేరని స్పష్టం చేసింది. మరోవైపు, రైతుల ఆందోళనపై స్పందించిన పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ మాట్లాడుతూ.. రైతులు తనను ఆహ్వానిస్తే కాళ్లకు పాదరక్షలు లేకుండా వెళ్లి కలుస్తానని పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా విజయం తనకు అత్యంత ప్రాధాన్య విషయమని సిద్ధూ పేర్కొన్నారు.

Punjab
Farmers
Farm Laws
Fire Accident
Navjot Singh Sidhu
  • Loading...

More Telugu News