YS Vivekananda Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. కీలక విషయాలు వెల్లడించిన వాచ్‌మన్ రంగయ్య
- ఊపందుకున్న వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు
- వివేకాది సుపారి హత్య అని చెప్పిన రంగయ్య
- ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్, దస్తగిరి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపణ
- మేజిస్ట్రేట్ ఎదుట రంగయ్య వాంగ్మూలం నమోదు
ఏపీ మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి వాచ్‌మన్ రంగయ్య వెల్లడించిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రంగయ్యను దాదాపు రెండున్నర గంటలపాటు విచారించిన సీబీఐ అధికారులు అనంతరం జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. అక్కడ ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
వివేకానందరెడ్డిది సుపారి హత్య అని రంగయ్య చెప్పినట్టు తెలుస్తోంది. సీబీఐ విచారణ అనంతరం రంగయ్య మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. తన పేరు వెల్లడిస్తే చంపేస్తానని వివేకానందరెడ్డి అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి తనను హెచ్చరించినట్టు చెప్పారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ కుమార్, దస్తగిరికి వివేకానందరెడ్డి హత్యతో సంబంధం ఉందని మేజిస్ట్రేట్‌కు చెప్పినట్టు రంగయ్య తెలిపారు. తనకు ఈ ముగ్గురి నుంచి కూడా ప్రాణహాని ఉందన్నారు. ఈ హత్య కేసులో మొత్తం 9 మంది పాత్ర ఉందని, అందులో ఇద్దరు ప్రముఖులు కూడా ఉన్నారని మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సమాచారం.
వివేకా మృతి కేసు గత నెలన్నర రోజులుగా ఊపందుకుంది. కడపలోనే ఉంటున్న సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తూ స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నారు.