Aswini Vaishnav: విశాఖ రైల్వే జోన్ లో వాల్తేరు డివిజన్ ను కలపాలని విజ్ఞప్తులు అందాయి: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
- రాజ్యసభలో విశాఖ జోన్ పై కనకమేడల ప్రశ్న
- లిఖితపూర్వకంగా బదులిచ్చిన కేంద్రమంత్రి
- త్వరలో జోన్ పరిధి నిర్ణయిస్తామని వెల్లడి
- జోన్ కార్యకలాపాల ప్రారంభానికి కాలపరిమితి లేదని వివరణ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ రాజ్యసభలో విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన వచ్చింది. టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రైల్వే జోన్ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. కనకమేడల అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
నూతన రైల్వే జోన్ లో వాల్తేరు డివిజన్ ను కలపాలని అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు అందాయని వెల్లడించారు. అన్ని అంశాలను పరిశీలించి జోన్ పరిధిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, విశాఖ జోన్ ఏర్పాటుకు నియమించిన ప్రత్యేక అధికారి డీపీఆర్ సమర్పించారని, ప్రస్తుతం ఆ డీపీఆర్ ను రైల్వేశాఖ పరిశీలిస్తోందని వెల్లడించారు. కొత్త రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభానికి కాలపరిమితి లేదని స్పష్టం చేశారు.