Jagan: ఆగస్టు 16 నుంచి స్కూళ్లు తెరవాలి: ఏపీ సీఎం జగన్ ఆదేశాలు
- ఆగస్టు 16న నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలి
- పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు
- వైసీపీ ప్రభుత్వం స్కూళ్ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోంది
ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో, పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు విద్యాశాఖకు సంబంధించి నాడు-నేడు కార్యక్రమం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆగస్టు 16 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని చెప్పారు. అదే రోజున నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని ఆయన అన్నారు. నాడు-నేడు పనుల్లో అవినీతికి తావుండకూడదని చెప్పారు. పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని చెప్పారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజునే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు.
సమావేశానంతరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడుతూ... ఆగస్టు 16న పాఠశాలలను పునఃప్రారంభిస్తామని, ఆ రోజున అనేక కార్యక్రమాలను పండుగలా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. తొలి విడత నాడు-నేడు కార్యక్రమం కింద 15 వేలకు పైగా స్కూళ్లను తీర్చిదిద్దామని తెలిపారు. రెండో దశ కింద 16 వేల స్కూళ్లను అభివృద్ది చేస్తామని చెప్పారు.