YS Jagan: దేశంలో నాలుగు భాషలు మాట్లాడగలిగే సీఎం జగన్ ఒక్కరే!: నూజివీడు ఎమ్మెల్యే వెంకటప్రతాప్ ప్రశంసల వర్షం
- గృహ నిర్మాణశాఖ సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలు
- 30 ఏళ్లపాటు ఏపీని జగనే పాలిస్తారన్న జోగి రమేశ్
- తమ నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు
దేశంలో నాలుగు భాషలు మాట్లాడగలిగే ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని, ఆయన ప్రధానిగా ఎదుగుతారని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు జోస్యం చెప్పారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ మరో 30 ఏళ్లపాటు జగనే ఈ రాష్ట్రాన్ని పాలిస్తారని అన్నారు. విజయవాడలో నిన్న జరిగిన గృహ నిర్మాణాల సమీక్షలో వీరు మాట్లాడుతూ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
సమీక్షలో జోగి రమేశ్ మాట్లాడుతూ.. జియో ట్యాగింగ్‌లో కాలయాపన జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నూజివీడు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి అదనపు రుణాన్ని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచాలని కోరారు. ఇసుక రవాణా లారీలను అడ్డుకుంటున్న పోలీసులు కేసులు రాస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ అన్నారు.
విజయవాడకు చెందిన లబ్ధిదారుల కోసం మైలవరం నియోజకవర్గంలో భూములు కొనుగోలు చేసిన విషయాన్ని అధికారులు తనకు చెప్పనేలేదని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మరోపక్క తాను టీడీపీ నేత దేవినేని ఉమతో ప్రతిరోజూ యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. అలాగే, తమ తమ నియోజకవర్గాలలోని పలు సమస్యల గురించి ఇతర ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.