Telangana: హక్కు పత్రం కోసం సాయమడిగితే.. భూమినే ఆక్రమించేసిన మున్సిపల్ కౌన్సిలర్
- హక్కు పత్రానికి రూ.2 లక్షల డిమాండ్
- ఇవ్వలేమని చెప్పిన బాధిత మహిళ
- రూ.70 లక్షల విలువైన భూమి ఆక్రమణ
- నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న నేత
ఆమె భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. అతడి పేరిట ఉన్న స్థలాన్ని తన పేరిట మార్చుకునేందుకు ఆమె ఓ ప్రజాప్రతినిధిని సాయం కోరింది. కానీ, అతడు ఆ స్థలంలోని రూ.70 లక్షల విలువైన భాగాన్ని ఆక్రమించి కాజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో జరిగింది. నెక్నాంపూర్ లో బాధితురాలు లక్ష్మి భర్తకు 163 గజాల స్థలం ఉంది. అది మున్సిపాలిటీలో విలీనం అయ్యాక ఆమె పన్ను కూడా కడుతోంది.
తన పేరిట హక్కు పత్రం ఇప్పించాలని కోరుతూ కొన్ని నెలల క్రితం ఓ మున్సిపల్ కౌన్సిలర్ సాయం కోరింది. అందుకు అతగాడు రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. తాము అంత ఇవ్వలేమని ఆమె అనడంతో ఆ స్థలంలోని 100 గజాలను ఆక్రమించాడు. తన స్నేహితుడి భూమి అంటూ నకిలీ పత్రాలు సృష్టించి తన సోదరుడి కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు.
ఇదేంటని అడిగిన ఆమెపై.. అసలు ఆ స్థలమే మీది కాదంటూ దౌర్జన్యానికి దిగాడు. అడిగిన డబ్బులు ఇవ్వనందుకే ఇలా చేశానంటూ ఎగతాళిగా మాట్లాడాడు. దీంతో రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి ఒరిజినల్ పత్రాలను సేకరించిన ఆమె.. హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఆ కేసును సైబరాబాద్ కమిషనరేట్ కు బదిలీ చేశారు.