Lok Sabha: లోక్ సభలోనూ అదే సీన్... రేపటికి వాయిదా
- నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- తొలిరోజు వాయిదా పడిన ఉభయసభలు
- లోక్ సభలో విపక్ష సభ్యుల ఆందోళన
- పోలవరం అంశంపై వైసీపీ సభ్యుల నిరసనలు
కరోనా పరిస్థితుల నడుమ నేడు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే వైసీపీ సభ్యుల ఆందోళనలు ఉభయ సభలను ప్రభావితం చేశాయి. ఇప్పటికే రాజ్యసభ వైసీపీ సభ్యుల ఆందోళనతో రేపటికి వాయిదా పడింది. తాజాగా లోక్ సభలోనూ అదే తరహా పరిస్థితులు కనిపించాయి. వైసీపీ సభ్యులు పలు అంశాలపై ఆందోళనకు దిగారు.
పోలవరం ప్రాజెక్టు అంచనాల ఆమోదం కోసం వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. వాయిదా తీర్మానం కోరుతూ ఎంపీ మిథున్ రెడ్డి స్పీకర్ కు నోటీసు ఇచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని ప్రకటించినా, ఆ దిశగా కేంద్రం నుంచి స్పందన లేదని వైసీపీ ఎంపీలు ఆరోపించారు. ఈ క్రమంలో సభ మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా పడినా, ఇతర అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళనలు దిగారు. పరిస్థితులు సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.