Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోల మృతి
- దోల్కాల్-పెదపాల్ అటవీ ప్రాంతంలో ఘటన
- బైరాంగఢ్ ఏరియా కమిటీ మావోయిస్టుల హతం
- మూడు తుపాకులు, మూడు కిలోల ఐడీఈ బాంబులు స్వాధీనం
చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. దోల్కాల్-పెదపాల్ అటవీ ప్రాంతంలో డీఆర్డీ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా బైరాంగఢ్ ఏరియా కమిటీ మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో అప్రమత్తమైన ఇరు వర్గాలు కాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోలు మరణించగా మిగిలిన వారు అక్కడి నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.
చనిపోయిన వారిని మిలటరీ ప్లాటూన్ కమాండర్ బిర్జు కాకెమ్ (35), ఆర్‌పీసీ ఉపాధ్యక్షుడు జగ్గూ కాకెమ్ (30), మిలీషియా ప్లాటూన్ సభ్యుడు అజయ్ ఒయామీ (26)గా గుర్తించారు. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి మూడు స్వదేశీ తుపాకులు, 3 కిలోల ఐఈడీ బాంబులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.