Yarlagadda: తెలుగు అకాడెమీ పేరు మార్చితే తెలుగు భాషకు వచ్చిన నష్టమేంటి?: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
- ఇటీవల తెలుగు అకాడెమీ పేరు మార్పు
- తెలుగు-సంస్కృత అకాడెమీగా మార్చిన సర్కారు
- విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు
- స్పందించిన అధికార భాషా సంఘం అధ్యక్షుడు
తెలుగు అకాడెమీ పేరును ఏపీ ప్రభుత్వం తెలుగు-సంస్కృత అకాడెమీగా మార్చడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ స్పందించారు. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే తెలుగు అకాడెమీకి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావని, సంస్కృత భాషాభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు వస్తాయని వెల్లడించారు. ఈ కోణంలో, పేరు మార్పు నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉందని యార్లగడ్డ స్పష్టం చేశారు. సీఎం జగన్ చొరవ చూపి మైసూరులో ఉన్న ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని నెల్లూరుకు తీసుకువచ్చారని వెల్లడించారు. అసలు, తెలుగుకు ప్రాచీన హోదా లభించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయత్నాల వల్లనేనని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో తెలుగు అకాడెమీని నిర్లక్ష్యం చేస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక 3 నెలల్లోనే పరిస్థితులు చక్కదిద్దారని యార్లగడ్డ వివరించారు.
తెలుగు అకాడెమీని, అధికార భాషా సంఘాన్ని టీడీపీ పాలకులు పతనం దిశగా తీసుకెళ్లారని విమర్శించారు. అయినా, తెలుగు అకాడెమీ పేరును తెలుగు-సంస్కృత అకాడెమీ అని మార్చినంత మాత్రాన వచ్చిన నష్టం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ అంశంలో చంద్రబాబు వ్యాఖ్యలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని యార్లగడ్డ పేర్కొన్నారు.