UK: బ్రిటన్ రాణివాసపు తోటల్లో పిక్ నిక్.. సందర్శకులకు అనుమతి
- కొత్తగా టికెట్లు పెట్టిన అధికారులు
- ఒక్కొక్కరికి 16.5 పౌండ్లు
- సెప్టెంబర్ వరకు ఓపెన్
బ్రిటన్ రాణివాసం బకింగ్ హాం ప్యాలెస్ తోటలను సందర్శకుల కోసం తెరిచారు. మహమ్మారి మొదలైనప్పటి నుంచి రాణివాసాన్ని సందర్శకుల కోసం అందుబాటులోకి తేవడం ఇదే మొదటిసారి. అయితే, ఈసారి ఆ తోటలను చూపించేందుకు గైడ్ లంటూ ఎవరూ ఉండరు. 39 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ తోటలను మనంతటమనమే తిరిగి చూసుకోవాలి.
అంతేకాదు, అక్కడికి పిక్నిక్ లకూ వెళ్లొచ్చు. అయితే ఓ షరతుంది. ఈసారి టికెట్లను పెట్టారు. తోటల అందాలను చూడాలంటే ఒక్కొక్కరు రూ.1,700 (16.5 పౌండ్లు) పెట్టి టికెట్ కొనాల్సిందే. కేవలం సెప్టెంబర్ వరకే తోటలను తెరచి ఉంచుతున్నట్టు రాణివాసం అధికారులు ప్రకటించారు.
‘‘ఈసారికి కేవలం తోటల వరకే సందర్శకులను అనుమతిస్తున్నాం. అయితే, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాజమహల్ గదులను తెరవట్లేదు’’ అని ప్యాలెస్ నిర్వహణను చూసుకుంటున్న రాయల్ కలెక్షన్ ట్రస్ట్ ప్రకటించింది. వాస్తవానికి తోటల్లో ఏటా మూడుసార్లు బ్రిటన్ రాణి పార్టీ ఏర్పాటు చేస్తుంటారు. కానీ, రెండేళ్లుగా కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆ పార్టీలేవీ జరగడం లేదు.