Gopal Krishna Dwivedi: విశాఖ జిల్లా లేటరైట్ గనులపై గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వివరణ
- మన్యంలో బాక్సైట్ తవ్వకాలు అంటూ టీడీపీ ఆరోపణలు
- స్పందించిన ఏపీ ప్రభుత్వం
- విశాఖ జిల్లాలో 6 గనులు ఉన్నాయని వెల్లడి
- వాటిలో ఒక్కటే పనిచేస్తోందన్న ద్వివేది
- అది లేటరైట్ గని అని స్పష్టీకరణ
విశాఖ మన్యం ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు పాల్పడుతున్నారని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడంపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది విజయవాడలో నేడు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ జిల్లాలో 6 లేటరైట్ గనులు ఉండగా, 5 పనిచేయడం లేదని వెల్లడించారు. ఒక్కదానికే లీజు అనుమతులు ఇచ్చామని తెలిపారు. అది కూడా 5 వేల టన్నుల తవ్వకాలకే అనుమతి ఇచ్చినట్టు వివరించారు. కొన్ని గనులకు సంబంధించిన లీజులపై కోర్టు వివాదాలు నడుస్తున్నాయని ద్వివేది తెలిపారు. హైకోర్టు తీర్పు మేరకు ఒక్క గనిలో మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అక్రమ తవ్వకాలు జరుపుతున్న వారిపై జరిమానాలు విధిస్తున్నామని స్పష్టం చేశారు.
కాగా, ఈ ప్రాంతంలో ఉన్న ఖనిజం లేటరైట్ అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలోనే వెల్లడించిందని పేర్కొన్నారు. తద్వారా ఈ గనుల్లో లభ్యమవుతున్న ఖనిజం లేటరైట్ అని, బాక్సైట్ కాదని స్పష్టమవుతోందని తెలిపారు.