BCCI: భారత్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూల్ ను మరోసారి మార్చిన బీసీసీఐ
- లంక జట్టులో కరోనా కలకలం
- సహాయక సిబ్బందిలో ఇద్దరికి పాజిటివ్
- క్వారంటైన్ లో లంక ఆటగాళ్లు
- సిరీస్ ను రీషెడ్యూల్ చేసిన బీసీసీఐ
- జులై 17న ప్రారంభం అని నిన్న వెల్లడి
- జులై 18 అంటూ ఇవాళ ప్రకటన
శ్రీలంక క్రికెట్ జట్టులో బ్యాటింగ్ కోచ్, డేటా ఎనలిస్టు కరోనా బారినపడడం భారత్ తో వన్డే సిరీస్ పై ప్రభావం చూపింది. మొదట నిర్ణయించిన ప్రకారం ఈ సిరీస్ జులై 13న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే లంక జట్టులో కరోనా కలకలం రేగడంతో ఆ జట్టు ఆటగాళ్లను క్వారంటైన్ కు తరలించారు. దాంతో సిరీస్ ను జులై 17 నుంచి నిర్వహించాలని నిన్న పేర్కొన్నారు.
అయితే, బీసీసీఐ ఈ సిరీస్ షెడ్యూల్ లో మరోసారి మార్పు చేసింది. తొలి మ్యాచ్ జులై 18న జరుగుతుందని బోర్డు ఇవాళ వెల్లడించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జయ్ షా ఓ ప్రకటన చేశారు. ఆతిథ్య జట్టులో కరోనా వ్యాప్తి నెలకొన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మార్చిన షెడ్యూల్ ప్రకారం ఈ సిరీస్ లోని మూడు వన్డేలు జులై 18, 20, 23 తేదీల్లో కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి. ఆపై జులై 25 నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది.