Kodandaram: కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ విలీనం ప్రసక్తే లేదు: కోదండరామ్
- కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనమవుతుందంటూ కథనాలు
- కోదండరామ్ సుముఖంగా ఉన్నట్టు ప్రచారం
- వివరణ నిచ్చిన కోదండరామ్
- హుజూరాబాద్ ఎన్నికపై త్వరలో నిర్ణయమని వెల్లడి
తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ స్పందించారు. కాంగ్రెస్ లో టీజేఎస్ ను విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ విలీనం ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే, జేఏసీగా ఏర్పడి ప్రజా సమస్యలపై పోరాడుదామని గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేసింది మాత్రం వాస్తవమని వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్ చెప్పారు.
టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి... టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన టీజేఎస్ ను విలీనం చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నాడని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు కోదండరామ్ కూడా సానుకూలంగానే ఉన్నారంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కోదండరామ్ వివరణ ఇచ్చారు.