Harsha Vardhan: కేంద్ర కేబినెట్ లో మరో వికెట్ డౌన్.. ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ రాజీనామా
- సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ
- ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తున్న పలువురు మంత్రులు
- ఏడుగురు సహాయ మంత్రులకు ప్రమోషన్
ఈ సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ ను ప్రధాని మోదీ ప్రక్షాళన చేస్తున్నారు. పలువురు కొత్త వారికి కేంద్ర మంత్రి వర్గంలో ఆయన స్థానం కల్పించబోతున్నారు. మరికొందరు మంత్రులకు ప్రమోషన్ ఇస్తున్నారు. ఇదే సమయంలో కొందరికి ఉద్వాసన పలకబోతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.
మరోవైపు అన్నివర్గాలకు సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని ప్రధాని మోదీ ఏర్పాటు చేయబోతున్నారు. కొత్త మంత్రి వర్గంలో ఆరుగురు వైద్యులు, ఐదుగురు ఇంజినీర్లు, 13 మంది న్యాయవాదులు ఉండబోతున్నట్టు సమాచారం. వీరితో పాటు పీహెచ్డీ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యావంతులకు మోదీ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. సహాయమంత్రులుగా ఉన్న ఏడుగురికి ప్రమోషన్ దక్కనున్నట్టు సమాచారం.