Pakistan: సరిహద్దులు, పీఓకేలో పాకిస్థాన్ హైసిగ్నల్ సెల్ టవర్లు
- 38 చోట్ల సెల్ టవర్ల ఏర్పాట్లు
- కశ్మీర్ మారుమూల ప్రాంతాలకు కూడా వస్తున్న సిగ్నల్స్
- పాక్ టీవీల సిగ్నల్స్ కూడా అందేలా చేస్తున్న పాకిస్థాన్
సరిహద్దుల్లో పాకిస్థాన్ నిర్మించిన సెల్ టవర్లు భారత్ కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జమ్ములో డ్రోన్లతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సెల్ టవర్లు భద్రతా సంస్థలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జమ్ము దాడి తర్వాత నిన్న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కీలక అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వీరు చర్చించారు. ఈ చర్చ సందర్భంగా పాక్ నిర్మించిన సెల్ టవర్లు కూడా చర్చకు వచ్చాయి. సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ సెల్ టవర్లను బలపరుస్తుండటంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నెట్వర్క్ లు సరిహద్దు ప్రాంతాలతో పాటు, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్నాయి. వీటి సిగ్నల్ భారత ప్రాంతంలోకి కూడా వస్తోంది. భారత్ లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు పాక్ కొన్నేళ్లుగా యత్నిస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ లో ఉద్రిక్తతలు ఉన్నప్పుడు, గొడవలు జరుగుతున్నప్పుడు, ఎన్ కౌంటర్లు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఇంటర్నెట్ ను ఆపేస్తుంటుంది. దీంతో, సంఘవిద్రోహ శక్తులకు ఆ సమయంలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకుండా పోతాయి.
అయితే, ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని అయిన తర్వాత అంతర్జాతీయ సరిహద్దు, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో 38 చోట్ల హైసిగ్నల్ సెల్ టవర్లను ఏర్పాటు చేస్తోంది. భారత ప్రభుత్వం సెల్ టవర్ సిగ్నళ్లను ఆపేసిన సమయాల్లో కూడా... ఈ టవర్ల ద్వారా కశ్మీర్ మారుమూల ప్రాంతాలకు కూడా పాక్ సిగ్నల్ వస్తోంది. పాక్ టీవీల నుంచి సిగ్నల్స్ అందేలా కూడా చేస్తున్నారు. భారత వ్యతిరేక ప్రచారానికి వీటిని వాడుకుంటున్నారు.