Sajjala Ramakrishna Reddy: తెలంగాణ కూడా కేఆర్ఎంబీ ఎదుటకు వచ్చి వాదనలు వినిపిస్తే బాగుంటుంది: సజ్జల
- జల వివాదాలపై సజ్జల స్పందన
- తాము కేఆర్ఎంబీలో వాదనలు వినిపిస్తున్నామని వెల్లడి
- కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం ఎందుకన్న సజ్జల
- ఢిల్లీ వెళ్లి సాధించేదేమీ లేదని వ్యాఖ్యలు
- న్యాయం తమవైపే ఉందని స్పష్టీకరణ
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణతో జలవివాదాలపై స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఎదుటకు వచ్చి వాదనలు వినిపిస్తే బాగుంటుందని సజ్జల అభిప్రాయపడ్డారు. తద్వారా కేఆర్ఎంబీ సమక్షంలోనే సమస్య పరిష్కారం అయ్యేదని అన్నారు. తాము కేఆర్ఎంబీ ఎదుటకు వచ్చి వాదనలు వినిపిస్తున్నప్పుడు కేసీఆర్ కు ఏమైందని ప్రశ్నించారు.
కేఆర్ఎంబీ సమావేశానికి రానని కేసీఆర్ అంటున్నారని, ఈ సమావేశానికి రాకుండా ఆయన ఢిల్లీ వెళ్లినందువల్ల ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా న్యాయం తమవైపే ఉందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేఆర్ఎంబీ పైనా విమర్శలు చేశారు. కేఆర్ఎంబీ పక్షపాతం చూపిస్తోందని ఆరోపించారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు.
అసలు ఈ నీటి కేటాయింపుల సమస్యలన్నీ చంద్రబాబు వల్లే వచ్చాయని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు అప్పుడే తెలంగాణ ప్రాజెక్టులపై నిలదీసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు.