Hindus: హిందువులు అత్యధికంగా ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే...!
- ఎక్కువ మంది హిందువుల ఆరాధ్య దైవం శివుడు
- తర్వాతి స్థానంలో హనుమంతుడు
- రాముడి కంటే హనుమాన్ కే ఎక్కువ మంది భక్తులు
పురాణాల ప్రకారం హిందువులకు ముక్కోటి దేవతలు ఉంటారు. అయితే హిందూ భక్తుల చేత పూజలు అందుకునే దేవుళ్లు మాత్రం అతి కొద్దిమందే. కొద్దిమంది దేవుళ్లకు మాత్రమే ఆలయాలు ఉంటాయి. అయితే, అమెరికాకు చెందిన పీవ్ రీసర్చ్ సెంటర్ ఇండియాలో ఉన్న వివిధ మతాలపై సర్వే చేపట్టింది. దేశంలో హిందువులు ఎక్కువగా కొలుస్తున్న ఇష్ట దైవాలపై సర్వే ఆధారంగా నివేదికను రూపొందించింది.
పీవ్ రీసర్చ్ సర్వే ప్రకారం ఎక్కువ మంది హిందువులు పరమ శివుడిని పూజిస్తున్నారు. 45 శాతం మంది హిందువులు శివుడిని ఆరాధిస్తున్నారు. శివుడి తర్వాత ఎక్కువగా పూజలు అందుకుంటున్న వారిలో హనుమాన్, గణేశ్, లక్ష్మీదేవి, కృష్ణుడు, కాళీమాత, రాముడు ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాముడి కంటే ఆయన సేవకుడు హనుమంతుడికి ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉన్నారు. హనుమంతుడికి 32 శాతం మంది భక్తులు ఉండగా... రాముడిని 17 శాతం మంది భక్తులు పూజిస్తున్నారు.
2019 నుంచి 2020 మధ్య కాలంలో ఈ సర్వే కొనసాగింది. తాజాగా సర్వే ఫలితాలను విడుదల చేశారు. సర్వేలో భాగంగా 30 వేల మంది నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. ఇతర మతస్తులతో ఇబ్బంది లేదని ఎక్కువ మంది భారతీయులు తెలిపారు. అయితే పొరుగువారు తమ సొంత మతస్తులైతేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చారు. 77 శాతం మంది హిందువులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుండగా... పునర్జన్మపై నమ్మకం ఉందని 27 శాతం మంది ముస్లింలు చెప్పారు.