Union Govt: ఐటీ చట్టం పాటించడంలో ట్విట్టర్ విఫలం: ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్రం
- ట్విట్టర్ లో గ్రీవెన్స్ అధికారిని నియమించాలంటూ పిటిషన్
- ఢిల్లీ హైకోర్టులో విచారణ
- నేడు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
- ట్విట్టర్ కు మూడు నెలల సమయం ఇచ్చామని వెల్లడి
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ తో వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నూతన ఐటీ నిబంధనలు పాటించడంలో ట్విట్టర్ విఫలమైందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ న్యాయస్థానానికి నివేదించింది. ఐటీ చట్టం నిర్దేశించిన మేరకు ప్రత్యేక అధికారులను నియమించడంలో ట్విట్టర్ విఫలమైందని వివరించింది.
నూతన ఐటీ చట్టం-2021 మార్గదర్శకాలు పాటించేందుకు, ప్రత్యేక అధికారులను నియమించేందుకు దేశంలోని అన్ని సోషల్ మీడియా సంస్థలకు మూడు నెలలు సమయం ఇచ్చామని తెలిపింది. కానీ ట్విట్టర్ నిర్దేశించిన సమయంలోగా చర్యలు తీసుకోలేకపోయిందని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు వివరించింది. కాగా, గతవారం జరిగిన విచారణలో ట్విట్టర్... ప్రత్యేక అధికారి (గ్రీవెన్స్) నియామకం చివరిదశలో ఉందని న్యాయస్థానానికి విన్నవించింది.
ఐటీ చట్టం-2021లోని రూల్ నెం.4 ప్రకారం ట్విట్టర్ వెంటనే ఓ గ్రీవెన్స్ అధికారిని నియమించాలని కోరుతూ న్యాయవాది అమిత్ ఆచార్య ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణలో భాగంగానే కేంద్రం నేడు అఫిడవిట్ దాఖలు చేసింది.