Rozer Federer: వింబుల్డన్ 2021... కష్టపడి ముందుకు వెళ్లిన ఫెదరర్!

Federer in Fourth Round in Wimbledon

  • కామెరాన్ నోరీతో మూడవ రౌండ్ లో పోటీ
  • నాలుగు సెట్లలో ఫెదరర్ విజయం
  • మరో మ్యాచ్ లో ఓడిపోయిన ఆండీ ముర్రే

తనకు ఎన్నో అద్భుత విజయాలను అందించిన బ్రిటన్ గ్రాస్ కోర్టులపై స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ పయనం కొనసాగుతోంది. వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ లో 22వ సంవత్సరం ఆడుతున్న ఫెదరర్ కు మూడవ రౌండ్ లో గట్టి పోటీ ఎదురైనప్పటికీ, శ్రమించి విజయం సాధించడం ద్వారా ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టాడు. మూడవ రౌండ్ లో వరల్డ్ 34వ ర్యాంకర్ కామెరాన్ నోరీతో తలపడిన ఫెదరర్, 6-4, 6-4, 5-7, 6-4 తేడాతో విజయం సాధించాడు.

తొలి రెండు సెట్లనూ ఫెదరర్ సునాయాసంగా గెలుచుకున్నప్పటికీ, మూడవ రౌండ్ లో కామెరాన్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఫెదరర్ ఎంతగా శ్రమించినా, కామెరాన్ తలొగ్గలేదు. దీంతో సెట్ కామెరాన్ వశమైంది. ఆపై కీలకమైన నాలుగో సెట్ లో ఫెదరర్, మరోసారి తన అనుభవాన్ని ఉపయోగించి, ఏస్ లతో విరుచుకుపడ్డాడు. దీంతో కామెరాన్ కు ఓటమి తప్పలేదు. దాదాపు 2.35 గంటల పాటు జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ఫెదరర్, నాలుగో రౌండ్ లోకి ప్రవేశించాడు.

ఈ మ్యాచ్ లో ఫెదరర్ ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం గమనార్హం. 38 సార్లు నెట్ వద్దకు దూసుకువచ్చిన ఫెడ్, 30 సార్లు పాయింట్లు గెలిచాడు. ఈ గెలుపుతో 1969లో యూఎస్ ఆటగాడు పాంచో గొంజాలెస్, 1975లో ఆస్ట్రేలియాకు చెందిన కెన్ రోజ్ వెల్ రికార్డులకు ఫెదరర్ దగ్గరయ్యాడు. వీరిద్దరూ 40 ఏళ్లు దాటిన తరువాత వింబుల్డన్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు ఎంపికకాగా, వారి తరువాత మూడవ పెద్ద వయస్కుడిగా ఫెడ్ నిలిచాడు.

మరో మ్యాచ్ లో రెండు సార్లు వింబుల్డన్ చాంప్ గా నిలిచిన ఆండీ ముర్రే, పదో సీడ్, కెనడాకు చెందిన షపవలోవ్ చేతిలో 6-4, 6-4, 6-2 తేడాతో ఓడిపోయాడు. ముర్రే 2013, 2016 టోర్నీల్లో వింబుల్డన్ ట్రోఫీని సాధించారన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News