West Bengal: బెంగాల్​ ఎన్నికల అనంతర హింసపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం.. ఆదేశాలు

Calcutta High Court Serious Over Bengal Post Poll Violence

  • వెంటనే కేసులను నమోదు చేయాలని పోలీసులకు ఆదేశం
  • బాధితులకు ప్రభుత్వమే చికిత్స చేయించాలి
  • జాధవ్ పూర్ కలెక్టర్, ఎస్పీపై కోర్టు ధిక్కరణ కేసు

పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకున్న ఎన్నికల అనంతర హింసపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసులను నమోదు చేయాల్సిందిగా బెంగాల్ పోలీసులను ఆదేశించింది. బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా చికిత్స చేయించాలని మమత సర్కార్ కూ ఆదేశాలిచ్చింది.

బాధితులకు రేషన్ కార్డులు లేకపోయినా ప్రభుత్వమే ఖర్చులను భరించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం తేల్చి చెప్పింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) సమర్పించిన మధ్యంతర నివేదిక ఆధారంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఆ హింసకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను భద్రంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. హింసలో చనిపోయిన బీజేపీ నేత అభిజిత్ సర్కార్ మృతదేహానికి మరోమారు శవపరీక్ష చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కోల్ కతాలోని కమాండ్ హాస్పిటల్ లో పోస్ట్ మార్టం చేయాలని పేర్కొంది.

కేసులను సరిగ్గా దర్యాప్తు చేయని జాధవ్ పూర్ కలెక్టర్, ఎస్పీలకు కోర్టు ధిక్కరణ నోటీసులను ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులెవరూ తమ ఫిర్యాదులను తీసుకోలేదని హింస బాధితులు ఆరోపిస్తున్నారని, దీనికి వారు ఏం సమాధానం చెబుతారని నిలదీసింది.

మేలో బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడగానే చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, ఆస్తుల ధ్వంసం వంటివి చోటుచేసుకున్నాయి. దీనికి మీరు కారణమంటే, మీరే కారణమంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

మరోపక్క, పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రులపైనా తృణమూల్ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘనలను తేల్చేందుకు ఎన్ హెచ్చార్సీ కమిటీని ఏర్పాటు చేసింది. దానిని ఆపాలంటూ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టుకెళ్లింది. దానిని కోర్టు కొట్టేసింది. ఈ క్రమంలోనే గత నెల 29న హెచ్చార్సీ కమిటీ సభ్యులపై తృణమూల్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.

  • Loading...

More Telugu News