Jet Airways: జెట్ ఎయిర్ వేస్ వేలం... ఇక జలాన్ కల్రాక్ సొంతం!
- 2019లో నిలిచిన జెట్ ఎయిర్ వేస్ సర్వీసులు
- ఆ వెంటనే ప్రారంభమైన దివాలా ప్రక్రియ
- రూ. 1,375 కోట్ల రుణ ప్రణాళికతో జలాన్ కల్రాక్ సొంతం
- బ్యాంకులకు దక్కేది మాత్రం నామమాత్రమే
విమానయాన రంగంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి.. కొన్నాళ్ల క్రితం తీవ్ర నష్టాల్లో మునిగిపోయి దివాలా తీసిన జెట్ ఎయిర్ వేస్ ను వేలం వేయగా, జలాన్ కల్రాక్ కన్సార్టియం దక్కించుకుంది. సమీప భవిష్యత్తులో జలాన్ కల్రాక్, రూ. 1,375 కోట్ల నిధులను జెట్ ఎయిర్ వేస్ మూలనిధి అవసరాలు, పెట్టుబడి వ్యయాలు, రుణ దాతలకు ఇవ్వాల్సిన మొత్తం కోసం కేటాయించనుంది. ఈ నిధుల్లో రూ. 475 కోట్లు రుణ దాతలకు చేరనున్నాయి. మిగతా మొత్తం సంస్థ అవసరాలకు వినియోగించనున్నారు.
కాగా, జలాన్ కల్రాక్ ప్రతిపాదించిన రుణ ప్రణాళిక ప్రకారం, గతంలో జెట్ ఎయిర్ వేస్ కు బ్యాంకులు ఇచ్చిన అప్పుల్లో మాత్రం భారీ కోత పడనుంది. జెట్ ఎయిర్ వేస్ కు దాదాపుగా రూ. 7,800 కోట్లను బ్యాంకులు రుణాలుగా ఇవ్వగా, కేవలం రూ. 475 కోట్లు మాత్రమే బ్యాంకులకు దక్కనున్నాయి. ఇందులోనూ కార్పొరేట్ దివాలా ప్రక్రియ ఖర్చులు పోగా బ్యాంకులకు నికరంగా రూ. 380 కోట్ల వరకే దక్కే అవకాశాలున్నాయి. ఈ మొత్తంలో ముందుగా రూ. 185 కోట్లను ముందుగా, మరో రూ. 195 కోట్లను జీరో కూపన్ బాండ్ల రూపంలో కన్సార్టియం చెల్లించనుంది.
ఇదే సమయంలో జెట్ ఎయిర్ వేస్ కు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు సంస్థలో 9.5 శాతం వాటా, అనుబంధ జెట్ ప్రివిలేజ్ ప్రైవేట్ లిమిటెడ్ లో 7.5 శాతం వాటా లభిస్తుంది. కాగా, 2019లో జెట్ ఎయిర్ వేస్ సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తీవ్ర నష్టాలు, పెరిగిన వ్యయాలతో పోలిస్తే ఆదాయం తగ్గడం, కనీసం వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సంస్థ దివాలా ప్రక్రియను ప్రారంభించింది. ఈ సంవత్సరం జూన్ 22న రుణ పరిష్కార ప్రణాళికను జలాన్ కల్రాక్ కన్సార్టియం సమర్పించగా, దాన్ని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆమోదించింది. ఇందుకు సంబంధించిన రాతపూర్వక ఆదేశాలను కూడా ఇవ్వడంతో జెట్ ఎయిర్ వేస్ ఇక జలాన్ కల్రాన్ సొంతమైనట్టే.