Chhattisgarh: ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతం
- బస్తర్ జిల్లాలో ఘటన
- 45 నిమిషాలపాటు ఎదురు కాల్పులు
- తప్పించుకున్న మరికొందరు మావోయిస్టులు
చత్తీస్‌గడ్, బస్తర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతమైనట్టు ఎస్పీ దీపక్‌ఝా తెలిపారు. దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలంగనార్ అటవీ ప్రాంతంలో కట్టేకళ్యాణ్-కంగదర్ గట్టీ ఏరియా కమిటీకి చెందిన కొందరు మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన డీఆర్జీ, సీఆర్‌పీఎఫ్ దళాలు మావోయిస్టుల కోసం జల్లెడ పట్టాయి.
ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో ఇరువర్గాలు తారసపడ్డాయి. దీంతో ఇరు వర్గాల మధ్య దాదాపు 45 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు పీఎల్‌జీఏ ప్లాటూన్ నంబరు 26 కట్టే కల్యాణ్ ఏరియా డిప్యూటీ కమాండర్ జోగా (30) ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు తప్పించుకున్నట్టు ఎస్పీ తెలిపారు.