Revanth Reddy: నాకు పీసీసీ పదవి వస్తుందని రిపోర్టు అందగానే ప్రగతి భవన్ తలుపులు తెరిచారు: రేవంత్ రెడ్డి
- టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి
- దూకుడు పెంచిన కాంగ్రెస్ ఎంపీ
- కేసీఆర్, కేటీఆర్ లపై ధ్వజం
- కేటీఆర్ ను మూసీలో ముంచాలంటూ వ్యాఖ్యలు
తెలంగాణ పీసీసీ చీఫ్ గా నియమితుడైన రేవంత్ రెడ్డి మాటల్లో పదును పెంచారు. కేసీఆర్, కేటీఆర్ లను లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని నిఘా వర్గాలు నివేదిక ఇవ్వగానే, హడావుడిగా ప్రగతిభవన్ తలుపులు తెరిచారని వ్యాఖ్యానించారు. ఖబడ్దార్ కేసీఆర్.... నీ సంగతేంటో చూస్తా అని హెచ్చరించారు. ఇకపై సాధారణ కరెంటు తీగల్లా కాదు, హైటెన్షన్ వైరులా కొట్లాడతాం అని స్పష్టం చేశారు.
హైదరాబాదు నగరానికి తండ్రీకొడుకులు చేసింది ఏమీలేదని విమర్శించారు. మెట్రో సిటీని భ్రష్టు పట్టించారని అన్నారు. నగరంలో సమస్యలు ఎలాంటివో కేటీఆర్ కు తెలియాలంటే ఆయనను మూసీ నదిలో ముంచి ఓ నాలుగు గంటలు ఉంచాలని వ్యంగ్యం ప్రదర్శించారు. కేటీఆర్ పర్యటనలు అంతా ఫ్యాషన్ పరేడ్ ను తలపిస్తుంటాయని, క్యాట్ వాక్ తరహాలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఓ రాష్ట్రంలో నాలాలు నిండిపోయి చెత్త పేరుకుపోవడంతో, ఆ కాంట్రాక్టరును పిలిపించి అతడిపై చెత్త వేశారని, కేటీఆర్ కు కూడా అదేరీతిలో సత్కారం చేయాలని అన్నారు.
ఇక, తాను సోదరిగా భావించే సీతక్క గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీతక్క తనతో సరిసమానం అని వివరించారు. ఒకే కుర్చీ ఉంటే ఆ కుర్చీలో తాను సీతక్కనే కూర్చోబెడతానని ఆమె పట్ల తన గౌరవాన్ని చాటారు. సీతక్క తనకు అండ అని పేర్కొన్నారు.